చౌదరిగూడ: షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ, గ్రామకంఠం భూముల ఆక్రమణలను ఏమాత్రం ఉపేక్షించేది లేదని టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు స్పష్టం చేశారు. జిల్లేడు చౌదరిగూడ మండలం తుమ్మలపల్లి గ్రామంలోని గ్రామకంఠం భూమిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాన్ని వెంటనే అడ్డుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ)కి సమాచారం అందించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మీడియా ముసుగులో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించే యత్నంలో భాగంగా అక్రమంగా ఇంటి నిర్మాణం చేపడుతున్నారని బక్కని తెలిపారు. దీనిపై గ్రామ కార్యదర్శి సదరు వ్యక్తికి పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ, ఏమాత్రం లెక్కచేయకుండా సమాధానం ఇవ్వకపోవడం విచారకరమన్నారు. అంతటితో ఆగకుండా, ప్రభుత్వ భూములను కాపాడాలని బాధ్యతాయుతంగా ఫిర్యాదు చేసిన బాధితులకే అధికారులు తిరిగి నోటీసులు జారీ చేయడం జిల్లేడు చౌదరిగూడ మండలంలో వెలుగు చూసిన విడ్డూరమైన వైనమని విమర్శించారు. గ్రామకంఠం భూమిని రక్షించాలని కోరుతూ బాధిత గ్రామస్తులు తనను కలవడంతో, ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

అధికారుల అలసత్వంపై తీవ్ర ఆగ్రహం

ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అధికారులే ఆక్రమార్కులకు కొమ్ముకాయడం దారుణమని బక్కని నరసింహులు మండిపడ్డారు. గ్రామ కార్యదర్శి నోటీసులు ఇచ్చినా పట్టించుకోని తీరుపై డీపీఓ తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యపై మాట్లాడేందుకు డీపీఓకి ఫోన్ చేసినా స్పందించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఒక మాజీ ప్రజాప్రతినిధి ఫోన్ చేసినా ఎత్తకపోతే, ఇక సామాన్య ప్రజల సమస్యలను ఏం పరిష్కరిస్తారని ప్రశ్నించారు.

inline-img

అలాగే షాద్‌నగర్ పట్టణంలోని సోలిపూర్ గ్రామ రెవిన్యూ పరిధిలో ఒక వెంచర్ నిర్వాహకులు ఏకంగా శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయ స్థలాన్ని పూడ్చివేసిన వైనంపై ఆర్డీవో అధికారికి ఫిర్యాదు చేస్తే, ఫిర్యాదు చేసిన వారినే దేవాలయానికి సంబంధించిన పత్రాలు తీసుకురావాలని కోరడం అధికారుల బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోందన్నారు. అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం, రియల్ ఎస్టేట్ వ్యాపారుల తైలాలకు లొంగిపోవడంపై షాద్‌నగర్ నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేసి భూములను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 27 Oct 2026 | 09:45 PM IST
Tags: