ఆమనగల్లు: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, లయన్స్ క్లబ్ ఆఫ్ అమనగల్ మరియు అమనగల్ పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 28వ తేదీన ఉదయం 9 గంటలకు అమనగల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు సీఐ ఎస్. వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన రక్తదాన శిబిరానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న ఎంతో మంది నిరుపేదల ప్రాణాలను కాపాడవచ్చని సీఐ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి ఈ రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు. ముఖ్యంగా అమనగల్, తలకొండపల్లి, కడ్తాల్ మండలాలకు చెందిన యువతీ యువకులు, స్వచ్ఛంద రక్తదాతలు తరలివచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ మహా రక్తదాన శిబిరంలో అమనగల్ సీఐ ఎస్. వెంకటేశ్వర్లుతో పాటు కడ్తాల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సైదిరెడ్డి, తలకొండపల్లి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జానకిరామ్ రెడ్డి తదితరులు పాల్గొని రక్తదాతలను ప్రోత్సహించనున్నారు. అమరవీరుల త్యాగస్మరణలో భాగంగా చేపడుతున్న ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 27 Oct 2026 | 10:05 PM IST
Tags: