హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో, ఖరీఫ్‌-2026 సీజన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల పరిధిలోని 365 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. ఇందులో 111 మండలాలు తీవ్ర కరువు ప్రభావిత మండలాలు కాగా, మరో 254 మండలాలు మధ్యస్థ కరువు మండలాలుగా ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ఏడాదితో పోలిస్తే జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు కురవాల్సిన వర్షపటంలో భారీగా కోత పడింది. సాధారణంగా రాష్ట్రంలో 740.6 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 615.5 మి.మీ. మాత్రమే పడటంతో సుమారు 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి. ఎల్‌నినో ప్రభావం, బలహీనపడిన అల్పపీడన వ్యవస్థల కారణంగా ఏర్పడిన దీర్ఘకాలిక వర్షాభావం పంటలను తీవ్రంగా దెబ్బతీసింది. ఫలితంగా వరి సాగు విస్తీర్ణం భారీగా తగ్గి, 69.19 లక్షల ఎకరాల నుంచి 57 లక్షల ఎకరాలకు పరిమితమైంది.

ఈ విపత్కర కరువు పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. కరువు ప్రభావిత మండలాల్లోని రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించడంతో పాటు, వ్యవసాయ పెట్టుబడి సాయాన్ని డీబీటీ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, తాగునీరు, పశుగ్రాసం కొరత తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు, ఉపాధి హామీ పథకం కింద అదనంగా మరో 50 రోజుల పని కల్పించాలని ప్రతిపాదించారు. కేంద్ర సహాయం కోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నిధులకై మెమోరాండం సమర్పించనున్నట్లు రేవంత్ సర్కార్ వెల్లడించింది. క్షేత్రస్థాయిలో కరువు తీవ్రతను అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరింది. ఈ కరువుకు సంబంధించి విడుదలైన ఉత్తర్వులు రాబోయే ఆరు నెలల పాటు అమల్లో ఉంటాయని, దీనికి సంబంధించిన జాబితాను జిల్లా గెజిట్లలో ప్రచురించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 27 Oct 2026 | 10:14 PM IST
Tags: