మహేశ్వరం: ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలను అందించడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని ఫ్యూచర్ సిటీ ఏసీపీ జానకి రెడ్డి స్పష్టం చేశారు. 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన అధికారిక వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని సగర్వంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జానకి రెడ్డి మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కావడం ఎంతో ప్రత్యేకమన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంటూ సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని, అలాగే పోలీసు స్టేషన్‌లో నమోదైన వివిధ కేసులను త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని దిశానిర్దేశం చేశారు.
మహేశ్వరం సీఐ, ఎస్‌హెచ్‌ఓ రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి పోలీసు క్రమశిక్షణ, అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని తెలిపారు. ప్రజల భద్రత కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని పేర్కొంటూ.. పోలీస్ సిబ్బందికి, స్థానిక ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో ఎస్సైలు ప్రసాద్, రాఘవేందర్, ధనుంజయ్‌తో పాటు పలువురు కానిస్టేబుళ్లు, పోలీసు సిబ్బంది, మీడియా ప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.


