నాగార్జునసాగర్:
తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగం పండిస్తున్న పంటలకు సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రతి రైతు కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నాగార్జునసాగర్‌లో తలపెట్టిన 'మహావరుణ యాగం' వైభవంగా జరిగింది. విజయ విహార్ వేదికగా నిర్వహించిన ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక క్రతువులో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొని వరుణ దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యాగంలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే బాలు నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. రైతన్నల కష్టమే తమ ప్రభుత్వ కష్టమని, రైతు పంట బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. వర్షాభావ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందకుండా ఉండేందుకు, వారి పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ మహావరుణ యాగాన్ని నిర్వహించినట్లు తెలిపారు. వర్షాలు పడి చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండితేనే భూగర్భ జలాలు పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్నారు.
ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ సీజన్ వర్షపాతంలో అనిశ్చితి నెలకొన్నందున, వ్యవసాయ శాఖ ద్వారా ప్రత్యామ్నాయ పంటలు, నీటి వినియోగంపై రైతులకు తగిన సూచనలు అందిస్తున్నామని వెల్లడించారు. నాగార్జునసాగర్ జలవనరులు సమృద్ధిగా నిండి నల్లగొండ జిల్లాతో పాటు దేవరకొండ నియోజకవర్గ రైతాంగానికి సాగునీరు పారాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తోందని, రైతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.


