కొల్లాపూర్: భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా చేపడుతున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో భారీ తిరంగా ర్యాలీ అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. బీజేపీ కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎల్లేని సుధాకర్ రావు నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చేతిలో మువ్వన్నెల జాతీయ జెండాలు పట్టుకుని, దేశభక్తి నినాదాలతో సాగిన ఈ ర్యాలీ కొల్లాపూర్ పట్టణంలో దేశభక్తి స్ఫూర్తిని చాటిచెప్పింది. ఈ సందర్భంగా ఎల్లేని సుధాకర్ రావు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు ప్రతి పౌరుడు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశం పట్ల తమ గౌరవాన్ని, జాతీయతా భావాన్ని చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


