షాద్‌నగర్: డిజిటల్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండటంతోనే సైబర్ మోసాల బారిన పడకుండా రక్షణ పొందవచ్చని షాద్‌నగర్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) సీతారాం స్పష్టం చేశారు. షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నా చిల్కమర్రి గ్రామంలోని ఏం ఎస్ ఎన్ (MSN) సంస్థ ప్రాంగణంలో ఉద్యోగులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం రెండో వారపు “సైబర్ నేరాల అవగాహన కార్యక్రమం” ఘనంగా నిర్వహించారు. “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” నినాదంతో డిజిటల్ భద్రత, ఆర్థిక మోసాల నివారణపై ఈ సదస్సులో విస్తృతంగా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సైబర్ నిపుణులు, పోలీస్ అధికారులు మాట్లాడుతూ.. నేడు ఉద్యోగులను ప్రధాన లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న నకిలీ స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ యాప్‌లు, అధిక లాభాల ఆశచూపే మోసపూరిత స్కీములు, అనధికార డిజిటల్ లోన్ యాప్‌లు మరియు ఫిషింగ్ లింకుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకింగ్ మరియు వ్యక్తిగత ఖాతాల భద్రత కోసం ఎల్లప్పుడూ బలమైన పాస్‌వర్డ్‌లను వినియోగించాలని, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోవాలని తెలిపారు. పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌ల ద్వారా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయవద్దని, అనుమానాస్పద ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్ లింకులను పొరపాటున కూడా క్లిక్ చేయకూడదని హెచ్చరించారు.
మోసానికి గురైతే వెంటనే స్పందించాలి
ఒకవేళ సైబర్ మోసానికి గురైనట్లయితే ఎలాంటి తటపటాయింపు లేకుండా వెంటనే “గోల్డెన్ అవర్”లో స్పందించడం అత్యంత కీలకమని పోలీసులు తెలిపారు. బాధితులు ఆలస్యం చేయకుండా వెంటనే 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, అలాగే cybercrime.gov.in అధికారిక పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. ఇలా వేగంగా స్పందించడం ద్వారా మోసపోయిన నగదును ఖాతాల్లో ఫ్రీజ్ చేసే అవకాశాలు మెరుగవుతాయని వివరించారు. అనంతరం నిర్వహించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఉద్యోగులు అడిగిన యూపీఐ భద్రత, వర్క్ ఫ్రమ్ హోమ్ మోసాలు, ఐడెంటిటీ థెఫ్ట్ తదితర అంశాలపై అధికారులు సమాధానాలిచ్చి సందేహాలను నివృత్తి చేశారు.


