షాద్‌నగర్: షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు కసబ్‌వాడలో తీవ్ర భయాందోళన రేకెత్తించే ఘటన చోటుచేసుకుంది. చాలా కాలంగా శిథిలావస్థలో ఉన్న ఓ పాత పాడుబడ్డ భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ ప్రమాదం జరగడానికి కొన్ని సెకన్ల ముందే మహిళ అక్కడి నుంచి లోపలికి వెళ్లడంతో పెను విషాదం తప్పినట్లయింది.
కసబ్‌వాడ ప్రాంతానికి చెందిన మహమ్మద్ జాంగీర్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్న ఇంటికి ఆనుకుని చాలా ఏళ్లుగా ఓ పాత భవనం శిథిలావస్థలో ఉంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ఆ భవనం గోడలు, పైకప్పు నానిపోయి ఒక్కసారిగా కూలి పక్కనే ఉన్న జాంగీర్ ఇంటిపై పడ్డాయి. ప్రమాద సమయానికి క్షణాల ముందే జాంగీర్ సతీమణి ఆ ప్రదేశం నుంచి ఇంట్లోకి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే భవన శకలాలు పడటంతో జాంగీర్ ఇల్లు పాక్షికంగా దెబ్బతిని కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
కూలిపోయిన భవన శిథిలాలను తక్షణమే తొలగించి తమకు రక్షణ కల్పించాలని బాధిత కుటుంబ సభ్యులు మున్సిపల్ అధికారులను వేడుకుంటున్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో వర్షాల వల్ల ఇలాంటి ప్రమాదకరంగా మారిన పాత, శిథిలావస్థ భవనాలను మున్సిపల్ అధికారులు వెంటనే గుర్తించి తొలగించే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


