ఫరూఖ్‌నగర్: రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) నూతన నాయకత్వం కొలువుదీరింది. మండల సింగిల్ విండో చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా మండల వైస్ చైర్మన్‌గా మరో సీనియర్ నాయకుడు తుపాకుల శేఖర్ నియామకానికి సంబంధించి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ తన క్యాంపు కార్యాలయంలో నూతన చైర్మన్ చల్లా శ్రీకాంత్ రెడ్డి, వైస్ చైర్మన్ తుపాకుల శేఖర్‌లను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు తరలివచ్చి నూతన చైర్మన్ దంపతులకు, వైస్ చైర్మన్‌కు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి మిఠాయిలు పంచి ఆనందం వ్యక్తం చేశారు.

ఫరూఖ్‌నగర్ మండల పార్టీ అధ్యక్షుడిగా సేవలు అందిస్తూ, స్థానిక శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుపు కోసం క్షేత్రస్థాయిలో విశేషంగా శ్రమించిన చల్లా శ్రీకాంత్ రెడ్డికి తగిన గుర్తింపు లభించడం పట్ల పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి ఎల్లప్పుడూ సముచిత గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, చిలకమర్రి గ్రామ సర్పంచ్ రవీందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, పలు గ్రామాల రైతులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన చైర్మన్, వైస్ చైర్మన్‌లకు అభినందనలు తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 14 Aug 2026 | 05:04 PM IST
Tags: