రంగారెడ్డి: రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు, వర్షపాత అంచనాలు మరియు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు వరి సాగుపైనే పూర్తిగా ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటలు, కూరగాయల సాగుపై దృష్టి సారించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి సూచించారు. ఈ నెల 15వ తేదీ తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ సంకేతాలు ఇస్తున్నందున, రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు పనులు చేపట్టాలని కోరారు.
అధిక నీటి అవసరం ఉండే వరి పంటకు బదులుగా స్థానిక భూములకు, వాతావరణానికి అనుగుణంగా తక్కువ నీటితో పండే కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, మొక్కజొన్న, నువ్వులు వంటి పంటలను ఎంపిక చేసుకోవాలని కలెక్టర్ రైతులకు వివరించారు. సెప్టెంబర్ మాసంలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నందున, అందుబాటులో ఉన్న నీటి వనరులకు తగ్గట్లుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే పంట నష్టాల నుంచి తప్పుకోవచ్చని పేర్కొన్నారు.
ప్రతి గ్రామంలోనూ రైతాంగానికి అవసరమైన శాస్త్రీయ, సాంకేతిక సూచనలు అందించాలని, వాతావరణ హెచ్చరికలపై రైతుల్లో అవగాహన పెంచాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనిశ్చిత వర్షపాత పరిస్థితులను తట్టుకునేలా రైతులు వ్యవసాయ శాఖ ఇచ్చే సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూ శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని పిలుపునిచ్చారు.


