రంగారెడ్డి: జిల్లా అభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ పాలనా విధానాల రూపకల్పనకు అత్యంత ప్రామాణిక గ్రంథంగా నిలిచే 'జిల్లా జనగణన హ్యాండ్‌బుక్' (డీసీహెచ్‌బీ) కోసం క్షేత్రస్థాయిలో నాణ్యమైన, ఖచ్చితమైన సమాచారాన్ని పకడ్బందీగా సేకరించాలని రాష్ట్ర జనాభా లెక్కల సంచాలకులు భారతి హోళికేరి ఆదేశించారు. రాబోయే 'జనగణన–2027' సన్నాహకాల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పరిశోధనలు, పరిపాలనా అవసరాలకు ఉపయోగపడే విధంగా వివరాలను పక్కాగా నమోదు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. విద్య, వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, విద్యుత్, వ్యవసాయం, చేతివృత్తులు వంటి తొమ్మిది ప్రధాన విభాగాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని క్షేత్రస్థాయి నుంచి సేకరించాలని సూచించారు. టౌన్ డైరెక్టరీలో పౌర సదుపాయాలు, పరిశ్రమలు, మురికివాడల వివరాలు పొందుపరచాలని, అన్ని డేటాను డీసీహెచ్‌బీ పోర్టల్ మరియు మొబైల్ యాప్ ద్వారా నమోదు చేయాలని వెల్లడించారు.
విలేజ్ డైరెక్టరీ సమాచార సేకరణకు 2025 డిసెంబర్ 31 ప్రామాణిక తేదీగా తీసుకుని, రెవెన్యూ గ్రామాల వారీగా క్రోడీకరించాలని ఆదేశించారు. ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 8 వరకు నెల రోజుల పాటు సమాచార సేకరణ కొనసాగుతుందని, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


