చిన్నంబావి: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు చేపట్టిన 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రంలో శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. స్థానిక వివేకానంద పాఠశాల విద్యార్థులు, వందలాది మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు జాతీయ జెండాలను చేతబూని ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
చిన్నంబావి మండల అధ్యక్షుడు బొగ్గు కురుమయ్య, రాష్ట్ర బీజేపీ నాయకులు కురువ చిన్న మల్లయ్య, నాగర్‌కర్నూలు జిల్లా జనరల్ సెక్రెటరీ జగ్గారి శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో ఈ ర్యాలీ కొనసాగింది. చిన్నంబావి చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ మీదుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు విద్యార్థులు, నాయకులు జాతీయ జెండాలతో ప్రదర్శనగా వెళ్లారు. అనంతరం తిరిగి చౌరస్తాకు చేరుకుని అందరూ కలిసి సామూహికంగా 'జనగణమన' జాతీయ గీతాలాపన చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య కోసం ప్రాణాలర్పించిన మహానేతల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి మేకల చెన్నయ్య యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్, ఎం. లింగస్వామి, కిరణ్, వెంకటస్వామి, మండ్ల గోపాల్, ఎన్. బాలయ్య నాయుడు తదితరులు బీజేపీ శ్రేణులు, స్థానికులు పాల్గొన్నారు.


