ఆసిఫాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఉందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మరోసారి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మధ్య నెలకొన్న గ్రూపు విభేదాలు పార్టీ బలోపేతానికి ఆటంకం కారాదని మంత్రి స్పష్టం చేశారు. నేతల మధ్య సమన్వయం లోపించడం సరికాదని, ఎవరికి వారే అన్నట్లుగా కాకుండా అందరూ సమష్టిగా పనిచేయాలని సూచించారు. వ్యక్తుల కంటే పార్టీనే సుప్రీం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని, పార్టీ ప్రయోజనాలే అందరికీ ప్రథమ ప్రాధాన్యంగా ఉండాలని పేర్కొన్నారు. పార్టీ పదవులు, నియామకాల విషయంలో నాయకులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలపవచ్చని, అయితే తుది నిర్ణయం మాత్రం టీపీసీసీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని స్పష్టం చేశారు.

అలాగే, ఎస్ఐఆర్ (SIR) తదుపరి ప్రక్రియను పార్టీ శ్రేణులు అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. నాయకులందరికీ తగిన అనుభవం ఉందని, గత విభేదాలను పూర్తిగా పక్కనపెట్టి ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజలకు సేవ చేసిన నాయకులకు, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు భవిష్యత్తులో సముచిత స్థానం, తగిన అవకాశాలు లభిస్తాయని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సైనికులా పనిచేయాలని సూచించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 17 Aug 2026 | 05:30 PM IST
Tags: