వికారాబాద్: కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయంగా తనను బలహీనపరిచేందుకు ప్రత్యర్థి పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొడంగల్‌లో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) సమీక్షా సమావేశంలో స్థానిక నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAలు), పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన సీఎం, ప్రతి అర్హుడి ఓటును కాపాడటమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
నన్ను దెబ్బతీయడానికే దొంగదెబ్బ కుట్రలు
"కొడంగల్ ప్రజల ఆశీర్వాదంతోనే నేను రాష్ట్రానికి నాయకత్వం వహించే స్థాయికి వచ్చాను. నన్ను రాష్ట్రస్థాయిలో దెబ్బతీయాలంటే ముందుగా కొడంగల్‌లో కాంగ్రెస్ బలాన్ని తగ్గించాలని ప్రత్యర్థులు చూస్తున్నారు" అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. పేర్లు వేరైనా బిఆర్ఎస్, బిజెపి రెండూ ఒక్కటేనని, కొడంగల్‌లో కాంగ్రెస్ సానుభూతిపరులతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఓట్లను జాబితా నుంచి తొలగించేందుకు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు.
ఇంకా 22 శాతం ఓట్ల నమోదు పెండింగ్
SIR ప్రక్రియ వివరాలను వెల్లడిస్తూ.. కొడంగల్‌లో ఇప్పటివరకు 1,96,620 ఓట్ల ప్రక్షాళన పూర్తయిందని, ఇంకా 54,635 మంది (దాదాపు 22 శాతం) కొత్త ఓటర్లు నమోదు కావాల్సి ఉందని తెలిపారు. "ఓటు కోల్పోతే పౌర గుర్తింపునే కోల్పోయినట్లు. ఆగస్టు 3వ తేదీ వరకు గడువు ఉన్నప్పటికీ, ఈ నెల 30వ తేదీ నాటికే కొడంగల్‌లో 100 శాతం SIR ప్రక్రియను పూర్తి చేయాలి" అని బీఎల్ఏలకు, కార్యకర్తలకు స్పష్టమైన గడువు విధించారు.


