వికారాబాద్: హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణ, గుర్తింపు, నియంత్రణ మరియు చికిత్స విభాగాలలో వికారాబాద్ జిల్లా జాతీయ స్థాయిలో అరుదైన మైలురాయిని అధిగమించింది. భారత ప్రభుత్వ జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) విధించిన కఠినమైన లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను, దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన అత్యుత్తమ 70 జిల్లాలలో వికారాబాద్ జిల్లాకు చోటు లభించింది. ఈ అద్భుతమైన పనితీరును అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ప్రతిష్ఠాత్మక 'సాక్ష్యం' ప్రశంసా సర్టిఫికెట్ అందజేసింది.

inline-img

4,536 మందికి ఉచిత ఏఆర్టీ చికిత్స

ప్రస్తుతం వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 4 వేల 536 మంది హెచ్ఐవితో జీవిస్తున్న వ్యక్తులను వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. వీరందరికీ జిల్లాలో ఉచితంగా ఏఆర్టీ (ART) చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో హెచ్ఐవి నిర్ధారణ అయిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 'టెస్ట్ అండ్ ట్రీట్' (Test and Treat) విధానం ద్వారా తక్షణమే చికిత్సను ప్రారంభించడం జరుగుతోంది. దీనితో పాటు బాధితులకు మానసిక ధైర్యాన్ని ఇచ్చేలా కౌన్సెలింగ్, నిరంతర ఆరోగ్య పర్యవేక్షణ, క్రమం తప్పకుండా మందులు వాడేలా అవగాహన కల్పించడం వల్లే ఈ జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని అధికారులు తమ ప్రకటనలో స్పష్టం చేశారు.

సమిష్టి కృషికి దక్కిన గౌరవం

జిల్లాకు దక్కిన ఈ ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డు.. జిల్లా కలెక్టర్ దీపక్ తివారి నిరంతర మార్గదర్శకత్వంలో లభించిందని అధికారులు పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) డాక్టర్ కె. సుధాకర్ లాల్ సమన్వయంతో పాటు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, స్థానిక ఏఆర్టీ కేంద్రాలు, ఐసీటీసీ (ICTC) పరీక్షా కేంద్రాల వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు చేసిన సమిష్టి కృషే వికారాబాద్ జిల్లాను దేశంలోనే ముందంజలో నిలిపిందని హర్షం వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 10 Jul 2026 | 03:58 PM IST
Tags: