వనపర్తి: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన జర్నలిస్టులందరికీ టీజీఆర్టీసీ (TGRTC) బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) వనపర్తి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ప్రభుత్వ పథకాల ప్రచారంలోనూ, సమాజ చైతన్యంలోనూ నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ మేరకు శుక్రవారం వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ (DM)ను కలసి ఫెడరేషన్ ప్రతినిధుల బృందం ఒక అధికారిక వినతిపత్రాన్ని అందజేసింది.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం – డీఎం హామీ
మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం తరహాలోనే జర్నలిస్టుల రవాణా ఇబ్బందులను కూడా ప్రభుత్వం గుర్తించాలని నేతలు కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన వనపర్తి డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టుల ఉచిత ప్రయాణ ప్రతిపాదనను రాష్ట్రస్థాయి ఆర్టీసీ ఉన్నతాధికారుల మరియు ఎండీ గారి కార్యాలయానికి తక్షణమే నివేదిస్తానని హామీ ఇచ్చారు. అలాగే రవాణా శాఖ పరిధిలో తనకు లభించే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలలో సైతం ఈ న్యాయమైన డిమాండ్‌ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తానని స్పష్టం చేశారు.
ఈ వినతిపత్రం అందజేసిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు అంబటి స్వామి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఆర్థిక కార్యదర్శి పవన్ కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు రాష్ట్ర స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు నిరంజన్, ఉపాధ్యక్షులు ఎర్రమన్ను బాలరాజ్, బలముకుందం, శివన్న యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు శివశంకర్ తదితరులు డీఎంను కలిసిన వారిలో ఉన్నారు.


