హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిరంతర కృషి, ప్రత్యేక ప్రయత్నాల నేపథ్యంలో ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మార్గం సుగమమవుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై వచ్చే సెప్టెంబర్ 1న ఢిల్లీలో అత్యంత కీలకమైన సమావేశం జరగనుంది.
కేంద్ర జల సంఘం (CWC) చైర్మన్ అధ్యక్షతన ఢిల్లీలోని సేవా భవన్‌లో ఈ సమావేశం జరగనుండగా.. ఇందులో తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టును వీలైనంత త్వరగా ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత మే 26న మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా లేఖ రాశారు. రెండు రాష్ట్రాల మధ్య ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని కోరారు. ఈ అంశం ప్రాధాన్యతను గుర్తించి ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లగా, పీఎంవో దీనిని జలశక్తి మంత్రిత్వ శాఖకు బదిలీ చేసింది. ఆ తర్వాత ఆగస్టు 5న కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌కు సీఎం లేఖ రాసి కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన వాదన
మహారాష్ట్ర గతంలో అంగీకరించిన 148 మీటర్ల ఎత్తుకు బదులుగా, బ్యారేజీ నీటి మట్టం 152 మీటర్ల ఎత్తు ఉండేలా అంగీకం సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ 148 మీటర్ల వద్దే ఉంచితే అవసరమైన నీటిని గ్రావిటీ ద్వారా తీసుకోవడం సాధ్యం కాదని, భారీ పంపులను వినియోగించాల్సి వస్తే విద్యుత్ వ్యయం విపరీతంగా పెరుగుతుందని తెలంగాణ ఇప్పటికే కేంద్రానికి నివేదించింది. తక్కువ విద్యుత్ ఖర్చుతో, దీర్ఘకాలికంగా రాష్ట్రంలోని వెనుకబడిన, కరువు ప్రభావిత ప్రాంతాలకు శాశ్వతంగా సాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. సీడబ్ల్యూపీఆర్‌ఎస్ (CWPRS) అధ్యయనాల ప్రకారం జలమట్టం పెంచడం వల్ల అదనపు ముంపు చాలా పరిమితంగానే ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది. ఈ కీలక ప్రాజెక్టును త్వరగా కార్యరూపంలోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కేంద్రం, మహారాష్ట్రతో వరుస సంప్రదింపులు జరుపుతూ ముందడుగు వేస్తోంది.


