వికారాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిజాం హయాం తర్వాత దాదాపు తొంబై సంవత్సరాల అనంతరం తిరిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వంలోనే సమగ్ర భూ సర్వే జరుగుతోందని రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. ధారూర్ మండలం తరిగోపుల, మోమిన్ కుర్దు గ్రామాలలో మంగళవారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా తరిగోపులలో 15 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన పీఏసీఎస్ (PACS) ధారూర్ సొసైటీ నూతన గోదాం నిర్మాణ శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం తరిగోపుల గ్రామంలో భూ సర్వేపై ఏర్పాటు చేసిన గ్రామ సభలో స్పీకర్ పాల్గొని మాట్లాడారు. భూముల ధరలు పెరగడంతో గ్రామాల్లో భూ పంచాయితీలు ఎక్కువయ్యాయని, ఈ సర్వే ప్రజల మంచి కోసమేనని, దీనిని విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని కోరారు.
అనహ్రత వేటు తీర్పుపై కేటీఆర్ విమర్శలకు కౌంటర్
వికారాబాద్ పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై చేసిన విమర్శలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్రంగా ఖండించారు. శాసనసభ్యుల అనర్హత అంశంపై ఇప్పటికే తానే స్వయంగా శాసనసభలోనే సమాధానం చెప్పానని గుర్తు చేశారు. తన పరిధిలో పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకుని 54 పేజీలతో కూడిన స్పష్టమైన తీర్పు కాపీని ఇచ్చానని, దానిని పూర్తిగా చదివితే ప్రతిపక్షాలకు అర్థమవుతుందని హితవు పలికారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా చేసిన అప్పులు, కార్పొరేషన్లు, ప్రాజెక్టుల మీదున్న అప్పులు కలిపి మొత్తం రూ.8.16 లక్షల కోట్లు ఉన్నట్లు అసెంబ్లీ సాక్షిగా తేలిందని, కానీ కేటీఆర్ మాత్రం కేవలం రెండు లక్షల కోట్ల అప్పు మాత్రమే చేశామని ఊరూరా తిరుగుతూ అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు.
మొదటి తేదీనే ఉద్యోగుల జీతాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థత వల్లే గత ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు, వడ్డీలు చెల్లిస్తూనే, మరోవైపు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులను సమకూరుస్తున్నామని స్పీకర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, కానీ తమ ప్రభుత్వంలో ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని చెప్పారు. గత పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆ పార్టీ నాయకులకు కూడా తెలుసన్నారు. స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన కోట్ పల్లి ప్రాజెక్టు మరమ్మత్తుల కోసం రూ.90 కోట్లు, నాగసమందర్ దగ్గర కోట్ పల్లి వాగుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు చేయించానని, పనులు చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు.
నియోజకవర్గంలో పీఆర్ రోడ్లకు రూ.300 కోట్లు, ఆర్ అండ్ బీ శాఖ పరిధిలోని రోడ్లకు రూ.450 కోట్ల నిధులు వచ్చాయని, వచ్చే రెండేళ్లలో అన్ని రోడ్లు కొత్తగా మారుతాయన్నారు. గత ప్రభుత్వం సబ్సిడీలను రద్దు చేసి కేవలం రైతు బంధు ఇస్తే, తమ ప్రభుత్వం సబ్సిడీ పథకాలతో పాటు రైతు భరోసా కూడా ఇస్తోందని, ఈ విషయాలను నాయకులు ప్రజలకు వివరించాలన్నారు. ఈ పర్యటనలోనే మోమిన్ కుర్దు గ్రామంలో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను స్పీకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


