హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఖజానాకు జీఎస్టీ రాబడులను మరింత పెంచుకోవడానికి మరియు లీకేజీలను అరికట్టడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ను వినియోగించడంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పటిష్టమైన ప్రణాళికలు రచిస్తున్నారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ప్రముఖ భారత ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా జీఎస్టీ అధికారులకు ప్రత్యేక ఏఐ ఆధారిత డేటా సహాయంతో పన్నుల ప్రక్రియను మరింత సులభతరం చేసే నూతన వ్యవస్థను తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ సాంకేతిక ప్రక్రియ ద్వారా వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తూనే, రాష్ట్ర రాబడిని పెంచడం మరియు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మెరుగుపరచడమే తమ ప్రధాన ఉద్దేశమని వివరించారు. ముఖ్యంగా భవన, నిర్మాణ సామగ్రి విక్రయాల్లో జరిగే పన్ను లీకేజీలను అరికట్టేందుకు మున్సిపల్, రేరా, పంచాయతీ రాజ్, విద్యుత్, ఆర్థిక మరియు వాణిజ్య పన్నుల శాఖలను ఏఐ సాంకేతికతతో అనుసంధానించాలని సూచించారు.
భారీ నిర్మాణ పనుల అనుమతుల దశలోనే సామగ్రి అవసరాలు, పన్ను అంచనాలను నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ డేటాతో పాటు మీసేవ, ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ వివరాలను సైతం సమీకృతం చేస్తే పరిపాలనా సంస్కరణలకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు కె. రామకృష్ణా రావు, సీఎస్ సంజయ్ జాజు, కమర్షియల్ టాక్స్ సెక్రటరీ రఘునందన్ రావు, ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


