మహేశ్వరం: మహేశ్వరం గేట్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. కళాశాలలో జూనియర్ ఇంటర్మీడియట్ (ఎంపీసీ) అభ్యసిస్తున్న కుమ్మరి చరణ్ తేజ (17) రాత్రికి రాత్రే హాస్టల్ నుంచి అదృశ్యమయ్యాడు. ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకళ మహేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కొత్తూరు మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన దివంగత కుమ్మరి సుభాష్ కుమారుడైన చరణ్ తేజ, తల్లిదండ్రులు లేకపోవడంతో మేనమామ కె. శైలూ సంరక్షణలో ఉంటున్నాడు. ఈ ఏడాది జూన్ నుంచి మహేశ్వరం గేట్‌లోని గురుకుల కళాశాలలో చేరుకుని హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ నెల 16వ తేదీ రాత్రి సుమారు 10:30 గంటలకు విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు హాస్టల్‌లో హాజరు తీసుకున్న సమయంలో చరణ్ తేజ అక్కడే ఉన్నాడు. అయితే అర్ధరాత్రి సమయంలో తోటి విద్యార్థులు వాష్‌రూమ్‌కు వెళ్లి తిరిగి వచ్చేసరికి అతను గదిలో కనిపించలేదు. తొలుత ఎక్కడికైనా వెళ్లి ఉంటాడని భావించినా, తెల్లవారుజాము వరకు జాడలేకపోవడంతో హాస్టల్ సిబ్బంది చుట్టుపక్కల గాలించారు.

ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో హౌస్ మాస్టర్ ద్వారా విద్యార్థి మేనమామకు సమాచారం అందించారు. అనంతరం మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. హాస్టల్ పరిసర ప్రాంతాల్లోని నిఘా కెమెరాల (CC Cameras) దృశ్యాలను పరిశీలిస్తూ దర్యాప్తును ముమ్మరం చేశారు. విద్యార్థి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే వెంటనే మహేశ్వరం పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 18 Aug 2026 | 03:45 PM IST
Tags: