షాద్‌నగర్: బతుకమ్మ, విజయదశమి పండుగలను నియోజకవర్గ ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని షాద్‌నగర్ సీఐ కె. సీతారాం ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు ఆయన బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
పండుగ వేళ భద్రతపై పలు కీలక సూచనలు చేస్తూ.. దసరా సెలవులకు ఇళ్లకు తాళాలు వేసి సొంత ఊళ్లకు వెళ్లేవారు తమ నగదు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఇళ్లలో ఎవరూ లేరనే విషయం గుర్తుతెలిసేలా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, ఇరుగుపొరుగు వారితో పాటు పోలీసులకు ముందస్తు సమాచారం అందిస్తే నిఘా పెంచుతామని తెలిపారు.
అలాగే బతుకమ్మ వేడుకలు, దసరా శోభాయాత్రల్లో పాల్గొనే మహిళలు రద్దీ ప్రాంతాల్లో తమ బంగారు ఆభరణాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు. పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, ఏదైనా వస్తువు పోయినా వెంటనే పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని స్పష్టం చేశారు. ప్రజలందరి సహకారంతో పండుగలను ప్రశాంతంగా, సురక్షితమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆయన కోరారు.


