మంథని: ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రోగ్రాం తుది దశకు చేరుకుంది. ఇటీవల నిర్వహించిన సమగ్ర సర్వే అనంతరం అధికారులు ముసాయిదా జాబితాను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు, వారి సందేహాలు నివృత్తి చేసేందుకు గురువారం నియోజకవర్గ వ్యాప్తంగా ఊరూరా బీఎల్‌వోలు గ్రామ, వార్డు సభలను నిర్వహించారు.
గ్రామ, వార్డుల్లోని ఓటర్ల ముసాయిదా జాబితాలను బీఎల్‌వోలు స్థానిక ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో గట్టిగా చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఏఎస్‌డీడీ (ఆచూకీ దొరకని, వలస వెళ్లిన, మృతి చెందిన, డూప్లికేట్) కింద తొలగించిన ఓటర్ల వివరాలను స్పష్టంగా వెల్లడించారు. అలాగే అనామలిస్, అన్-మ్యాపింగ్ కింద ఓటర్లకు ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసుల వివరాలను ప్రజలకు తెలియజేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు తుది జాబితాలో ఉండేలా చూడటమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టారు.
సభల సందర్భంగా బోగస్ ఓట్లు, ఇతరత్రా అభ్యంతరాలు ఏవైనా ఉంటే వాటిని నమోదు చేసుకున్నారు. ఈ ఏడాది అక్టోబరు 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులు ఉంటే వారి వివరాలను సేకరించి కొత్తగా నమోదుకు చర్యలు తీసుకున్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు, చిరునామాలలో తేడాలు, అక్షర దోషాలు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దేందుకు వీలుగా ఫారం-6, ఫారం-7, ఫారం-8లను అందుబాటులో ఉంచారు. మంథని మండలంలోని 35 గ్రామ పంచాయతీలలో, మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో ఈ గ్రామసభలు విజయవంతంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.


