మునుగోడు: పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన మునుగోడు సమీపంలోని సల్సార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రానికి వచ్చిన పత్తి నిల్వలు, కొనుగోలు వివరాలు, తూకం రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా సీసీఐ అధికారులు, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. స్లాట్ బుకింగ్‌లో ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. పత్తి తేమ శాతాన్ని పరిశీలించారు. కాగా, ప్రస్తుతం ప్రైవేట్ జిన్నింగ్ మిల్లులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే ఎక్కువగా.. క్వింటాలు పత్తిని రూ.9,160/-ల వరకు కొనుగోలు చేస్తున్నాయని వ్యాపారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. రిజిస్టర్ల నిర్వహణలో సీసీఐ కొనుగోలు కేంద్రానికి, జిన్నింగ్ మిల్లుకు ఎలాంటి తేడాలు ఉండకూడదని, తూకం, ధరలలో వ్యత్యాసం లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.
'ఎల్ నినో' దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపాలి
అక్కడే ఉన్న పత్తి రైతులతో మాట్లాడిన కలెక్టర్.. ఎకరాకు వచ్చే దిగుబడి, భూగర్భ జలాల పరిస్థితిపై ఆరా తీశారు. రాబోయే యాసంగి (రబీ) సీజన్లో 'ఎల్ నినో' పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున, నీటి లభ్యత తక్కువగా ఉండే ప్రాంతాల్లో వరి సాగును తగ్గించి జొన్నలు, సజ్జలు, మిల్లెట్స్, పుచ్చకాయ, కూరగాయలు, మినుములు, కుసుమ, ఆముదం వంటి తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు.
రైతులు సమిష్టి వ్యవసాయం (క్లస్టర్ ఫార్మింగ్) చేయడానికి ముందుకు వస్తే, పండించిన పంటలను క్షేత్రస్థాయిలోనే విక్రయించుకునేలా మార్కెటింగ్ అనుసంధానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ దిశగా తక్షణమే ప్రణాళిక రూపొందించాలని జిల్లా వ్యవసాయ అధికారి (DAO) వినోద్ కుమార్, డిసిఓ మమత, మార్కెటింగ్ ఏడి ఛాయాదేవిలను ఆదేశించారు. పిఎసిఎస్ (PACS) గోదాములను మిల్లెట్స్ నిల్వ ఉంచేందుకు సిద్ధం చేయాలని, కూరగాయలు పండించే రైతులకు సబ్సిడీపై విత్తనాలు, బిందు-తుంపర (డ్రిప్, స్ప్రింక్లర్) సేద్య పరికరాలు అందించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సీసీఐ ప్రతినిధులు పాల్గొన్నారు.


