షాద్‌నగర్: సంఖ్యాపరంగా బలమైన ముదిరాజ్ సమాజం రాజకీయంగా చైతన్యవంతమై, ఏకతాటిపైకి వచ్చినప్పుడే సముచిత ప్రాతినిధ్యం, ఆశించిన హక్కులు సాధ్యమవుతాయని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. బహుజన పోరాట యోధుడు, నిరుపేదల ఆశాజ్యోతి పండుగ సాయన్న జయంతి వేడుకలను పురస్కరించుకుని షాద్‌నగర్ పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ముదిరాజ్ సంఘం పెద్దలు అందే బాబయ్య, మంగ వెంకటేష్, అంచే రాములు, మున్సిపల్ వైస్ చైర్మన్ అందేమోహన్ ముదిరాజ్, అంబటి ప్రభాకర్, బుడ్డ నరసింహులు, బుద్దుల జంగయ్య, కావలి శ్రీశైలం, శ్రీధర్ వర్మ తదితరుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. ఆనాటి సంస్థానాధీశులు, భూస్వాముల దౌర్జన్యాలను ఎదిరించి, అణగారిన వర్గాల ఆకలి తీర్చడానికి తన ప్రాణాలనే పణంగా పెట్టిన గొప్ప వీరుడు పండుగ సాయన్న అని కొనియాడారు. సమాజం కోసం సర్వస్వం త్యాగం చేసిన ఇటువంటి మహనీయుల చరిత్రను మరుగున పడనీయకుండా భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
రాజకీయ ఐక్యత లోపిస్తే అవకాశాలు దూరం
ముదిరాజ్ వర్గానికి జనాభా పరంగా గణనీయమైన బలం ఉన్నప్పటికీ, రాజకీయ చైతన్యం లేకపోవడం, చిన్నచిన్న ప్రలోభాలు, తాయిలాలకు లొంగిపోయి చీలిపోవడం వల్లే రాజకీయంగా నష్టపోతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసంగాల మాయలో పడకుండా, స్వార్థాన్ని వీడి సమాజ హితం కోసం అంతా ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. "హక్కులను ఎవరూ చేతుల్లో పెట్టరు, మన బలాన్ని ప్రదర్శించి సాధించుకోవాలి" అని ఆయన తేల్చిచెప్పారు.
ముదిరాజుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
ముదిరాజ్ సమాజానికి కేబినెట్ స్థాయి మంత్రి పదవి కల్పించాలనే డిమాండ్‌తో పాటు, ఇతర సమస్యల పరిష్కారానికి సంబంధించి గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఎమ్మెల్యే గుర్తుచేశారు. కుల వర్గీకరణ తదితర అంశాల్లో న్యాయపరమైన ప్రక్రియలు ముడిపడి ఉన్నందున, తగిన సమయం చూసి సీఎం వద్దకు తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి గట్టిగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముదిరాజ్ సామాజికవర్గం ఏ పార్టీలో ఉన్నప్పటికీ తమ జాతి ప్రయోజనాల కోసం ఐక్యంగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీ మరియు ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ ముదిరాజుల సంక్షేమానికి అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్మన్ అందే మోహన్ ముదిరాజ్, సింగిల్ విండో చైర్మన్ అంబటి ప్రభాకర్ ముదిరాజ్, ముదిరాజ్ సంఘం నేతలు అందే బాబయ్య, మంగ వెంకటేష్, సింగిల్ విండో వైస్ చైర్మన్ తుపాకుల శేఖర్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నల్లమోని శ్రీధర్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు ర్యాకల శ్రీనివాస్, అంచే రాములు, కనుగు అన్మయ్య, బుడ్డ నర్సింహులు, మంగ మధు, మంగ అశోక్, తుమ్మల గోపాల్, సంతోష్ కుమార్, శ్రీధర్ వర్మ, పసుపుల ప్రశాంత్ ముదిరాజు, మాజీ ఎంపీటీసీ కావాలి శ్రీశైలం, బిమారం లక్ష్మయ్య, తంగెళ్లపల్లి శంకర్, నిరటి వాసు, జగదీష్, గుల్లే కృష్ణయ్య, యాదయ్య ముదిరాజ్, అందే పైలయ్య, మేకల వెంకటేష్, భరత్, ప్రదీప్ ముదిరాజ్, జగదీష్ ముదిరాజు, శ్రీనివాస్ ముదిరాజ్, వెంకటేష్, మున్సిపల్ కౌన్సిలర్లు రాజు నాయక్, పెంటయ్య, కాంగ్రెస్ ఎస్సీ విభాగం నియోజకవర్గ చైర్మన్ జాంగారి రవి, లింగారెడ్డిగూడ ఉప సర్పంచ్ అశోక్, అప్పారెడ్డిగూడ సీతారాం ముదిరాజ్, జేఏసీ నేతలు జనార్ధన్, రిటైర్డ్ తహశీల్దార్ సరాపు జగదీశ్వర్, టెలిఫోన్ వెంకటయ్య, రాము తదితరులు పాల్గొన్నారు.


