షాద్‌నగర్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సమాజంలో సోదరభావానికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని చటాన్‌పల్లిలో వెలిసిన దుర్గామాత మండపంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు, మహ అన్నదాన వితరణ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా, ఎలాంటి వర్గ భేదాలు లేకుండా ప్రజలందరూ ఒకే వేదికపై చేరి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనానికి నిదర్శనమని కొనియాడారు. దుర్గాభవాని అమ్మవారి దివ్య ఆశీస్సులతో సమాజంలోని ప్రతీ కుటుంబం ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు వాణి పాండురంగ రెడ్డి, నందారం అశోక్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు దినేష్ సాగర్, వెంకటరెడ్డి, మల్లేష్ ముదిరాజ్, రాఘవేందర్ రెడ్డి, సాయి రెడ్డి, మహేష్ గౌడ్, విక్రమ్ రెడ్డి, పేపర్ శివ, వంశీ రెడ్డి, శశిధర్ రెడ్డి, నాని, చందు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.


