షాద్‌నగర్: పాలమూరు ప్రాంత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వీరుడు, పేద ప్రజల పక్షాన నిలబడి అన్యాయాలపై ధైర్యంగా పోరాడిన ధీరుడు పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలను షాద్‌నగర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర నాయకులు, షాద్‌నగర్ నియోజకవర్గ ప్రముఖులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. పండుగ సాయన్న తన కాలంలో సామాన్య ప్రజలు, పేదలు, బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొన్న దోపిడీకి, అన్యాయాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడిన నిజమైన ప్రజావీరుడని కొనియాడారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఆయన సాగించిన పోరాటం, పేదల పట్ల ఆయన చూపిన ఆదరణ, సమాజం పట్ల ఆయనకున్న బాధ్యతాభావం నేటి తరానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పాలమూరు ప్రాంత చరిత్రలో పండుగ సాయన్నకు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆయన పోరాట స్ఫూర్తిని భావితరాలకు సవివరంగా తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన నొక్కిచెప్పారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా సమాజంలో సమానత్వం, న్యాయం, పేదల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముదిరాజు సంఘం పెద్దలు, బీజేపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, పండుగ సాయన్న అభిమానులు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 22 Oct 2026 | 01:59 PM IST
Tags: