మహేశ్వరం: మహేశ్వరం గ్రామంలో ప్రజల తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకుల స్థలానికి సంబంధించిన వివాదాన్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మహేశ్వరం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గత మూడు నెలలుగా ఈ వివాదం కొనసాగుతుండగా, సమస్య పరిష్కారం కోసం ఇచ్చిన ఫిర్యాదుపై 15 రోజులుగా అధికారులు స్పందించకపోవడంతో నాయకులు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. గ్రామానికి తాగునీరు అందించే వాటర్ ట్యాంకులను, వాటి స్థలాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీపై ఉందన్నారు. వాటర్ ట్యాంకుల స్థలానికి సంబంధించిన ప్రహరీ గోడపై వివాదాస్పదంగా 'కబ్రస్తాన్' అని రాసిన వారిని గుర్తించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామ సర్పంచ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
సర్వే నంబర్ 336లోని భూ రికార్డులను, హద్దులను రెవెన్యూ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అధికారిక పత్రాల ఆధారంగా వివాదాన్ని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. నిరసన తెలిపిన నాయకులతో మాట్లాడిన ఎంఆర్ఓ.. రేపటిలోగా సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో నాయకులు నిరసనను విరమించారు.
బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి వనంపల్లి శ్రవణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా కార్యదర్శి పాండు నాయక్, సీనియర్ నాయకులు తింగరికారి నాగేశ్వర్ ప్రకాష్, ఆదిల్ల కుశలయ్య, మండల కార్యదర్శి మహేందర్, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు చిందం జంగయ్య, రామోజీ, బొమ్మని జంగయ్య, శ్రీశైలం యాదవ్, దూసకంటి సాయినాథ్, బూత్ అధ్యక్షుడు దూసకంటి గణేష్, గాజుల శేఖర్, భీమనపల్లి రాజేష్, సందుల గణేష్ తదితరులు పాల్గొన్నారు.


