భద్రాద్రి కొత్తగూడెం: రాబోయే కాలంలో తాగునీటి కష్టాలు తలెత్తకుండా ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టామని తెలిపారు. ఆదివారం ఆయన దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద జరుగుతున్న నీటి నిల్వ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కుమ్మరి గూడెం వైపు ఒడ్డు నుంచి బోటులో దుమ్ముగూడెం అవతల ఒడ్డుకు చేరుకుని, ఆనకట్టపై ఒక మీటర్ ఎత్తున ఏర్పాటు చేస్తున్న ఇసుక బస్తాల నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. సూపర్ ఎల్‌నినో ప్రపంచానికి ఒక పెద్ద విపత్తులా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాగునీటి గండం లేకుండా గోదావరి నీటిని నిల్వ చేస్తున్నామని చెప్పారు. దుమ్ముగూడెం ఆనకట్టపై మీటర్ ఎత్తున నీరు నిలిచేలా ఇసుక బస్తాలను ఏర్పాటు చేసి, ఒక టీఎంసీ నీటిని నిల్వ చేసేలా పనులు సాగుతున్నాయని వివరించారు. ఎగువ నుంచి వరద ఉధృతి ఉన్నప్పటికీ ఇసుక బస్తాలు దెబ్బతినకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తాగునీటి సమస్యపై సీఎం రేవంత్‌రెడ్డికి వివరించగా, ఆయన వెంటనే స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు.

అసాధారణ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎల్‌నినో ప్రభావంతో సాధారణంగా ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీలు పెరిగితేనే ఎండలు భగ్గుమంటాయని, అయితే పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ అంచనా వేసిందని మంత్రి తెలిపారు. దీనివల్ల ఎండలు ఏకంగా 50 డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ అసాధారణ వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 25 Oct 2026 | 07:41 PM IST
Tags: