షాద్‌నగర్: వ్యవసాయ రంగానికి అందిస్తున్న విద్యుత్ సరఫరా వ్యవస్థ పనితీరును మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) సీఎండీ జితేశ్ వి. పాటిల్ (ఐఏఎస్) ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆదివారం రోజున షాద్‌నగర్, రాయికల్, రామేశ్వరం తదితర పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సంస్థ డైరెక్టర్ శివాజీతో కలిసి ఆయన ఆకస్మికంగా క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా వ్యవసాయ విద్యుత్ ఫీడర్లలో విద్యుత్ ప్రవాహం, వోల్టేజీ స్థాయులను సీఎండీ స్వయంగా పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా స్థితిగతులు, లో వోల్టేజీ సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై పాటు లైన్ల పనితీరును స్థానిక అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

రైతులకు నిరంతర నాణ్యమైన విద్యుత్ అందించాలి

అనంతరం సీఎండీ జితేశ్ వి. పాటిల్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకొని, ఒకవేళ ఏమైనా సమస్యలు ఎదురైతే వాటిని వెంటనే పరిష్కరించేందుకే ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. అన్నదాతలకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన, స్థిరమైన నిరంతర విద్యుత్‌ను అందించేందుకు అధికారులు, సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పర్యవేక్షణతో రైతులకు మరింత మెరుగైన విద్యుత్ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ తనిఖీ కార్యక్రమంలో షాద్‌నగర్ విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ శివసుందర్ రెడ్డితో పాటు పలువురు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 25 Oct 2026 | 07:15 PM IST
Tags: