వీపనగండ్ల: ఓటర్ల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను నిర్దేశిత గడువులోగా సమర్థవంతంగా, వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. శనివారం వనపర్తి జిల్లా వీపనగండ్లలో నిర్వహించిన ఎస్‌ఐఆర్‌ అవగాహన కార్యక్రమంలో బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు), బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు)తో మంత్రి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

మందకొడి గ్రామాల్లో స్పెషల్ ఫోకస్

గ్రామాలవారీగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పురోగతిని పరిశీలించిన మంత్రి.. కొన్ని ప్రాంతాల్లో పనులు మందకొడిగా సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెనుకబడిన గ్రామాల్లో ప్రత్యేక దృష్టి సారించి వేగవంతం చేయాలన్నారు. వలస వెళ్లిన ఓటర్లను గుర్తించి, వారిని ఫోన్ల ద్వారా సంప్రదించి ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియ సాగాలని స్పష్టం చేశారు.

బీఎల్‌వో, బీఎల్‌ఏలకు నగదు బహుమతులు

విధుల్లో వేగం, జవాబుదారీతనం పెంచేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా అత్యంత సమర్థవంతంగా పూర్తి చేసిన బూత్ లెవల్ సిబ్బందికి ప్రోత్సాహకంగా నగదు బహుమతులు అందజేస్తామని ప్రకటించారు.

  • ప్రథమ బహుమతి: ₹10,000

  • ద్వితీయ బహుమతి: ₹5,000

ఈ ప్రోత్సాహకాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వంద శాతం విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 18 Jul 2026 | 04:33 PM IST
Tags: