మహేశ్వరం, ఆగస్టు 27: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎక్స్‌రోడ్ వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం ఎక్స్‌రోడ్ వద్ద కల్లు కాంపౌండ్ యజమాని పల్లె రాజు ఉదయం సుమారు 7:30 గంటలకు కాంపౌండ్ తెరవడానికి వచ్చారు. అదే సమయంలో పక్కనే నివసించే స్వర్గగంటి బిక్షమమ్మ వచ్చి, తమ ఇంటి ముందు అరుగుపై గణేష్ (40) పడుకుని ఉన్నాడని, ఎంత పిలిచినా స్పందించడం లేదని రాజుకు తెలిపింది. దీంతో రాజు అక్కడికి వెళ్లి పరిశీలించగా గణేష్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో, కదిలించి చూడగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు గుర్తించారు.

మృతుడు గణేష్‌కు తల్లిదండ్రులు ఎవరూ లేరని, గత కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేక భిక్షాటన చేస్తూ రోడ్లపైనే నిద్రిస్తూ ఉండేవాడని స్థానికులు తెలిపారు. అనారోగ్యంతో ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో ఆయన సహజ మరణం చెంది ఉండవచ్చని ఫిర్యాదుదారు పోలీసులకు వివరించారు. ఈ ఘటనపై మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి ఫోటోను గుర్తించిన వారు లేదా అతని రక్త సంబంధికులు ఎవరైనా ఉంటే వెంటనే మహేశ్వరం పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు. సమాచారం అందించాల్సిన ఫోన్ నంబర్లు: 8712662684, 8712579935.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 27 Aug 2026 | 05:07 PM IST
Tags: