మహేశ్వరం: మహేశ్వరం మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ గడికోట మైసమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాది ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గ్రామంలోని వివిధ సంఘాలు, గ్రామ పెద్దలు, యువకులు ఈ కార్యక్రమ నిర్వహణకు పూర్తి సహకారం అందిస్తున్నారు.

మొదటి రోజు సోమవారం ఉదయం వేద ఆశీర్వచనం, గోపూజ, గణపతి పూజ, పుణ్యవచనం, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, కలశ స్థాపనతో పాటు అమ్మవారి ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయంత్రం అంకురారోపణ, అగ్నిప్రతిష్ఠ, హోమాలు జరిగాయి. రెండో రోజైన 18న ప్రాతఃకాల పూజల అనంతరం ఆవాహిత మండప దేవత హోమాలు, గణపతి, రుద్ర, నవగ్రహ, అమ్మవారి మూలమంత్ర హోమాలు కొనసాగనున్నాయి. చివరి రోజైన 19వ తేదీన ప్రాతఃకాల పూజలు, దీక్షా హోమాలతో పాటు యంత్ర ప్రతిష్ఠ నిర్వహిస్తారు. ఉదయం 8.29 గంటలకు అమ్మవారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేత్రపర్వంగా జరగనుంది. అనంతరం బింబ కళాన్యాసం, గర్త పూజలు, బలి ప్రధానం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

inline-img

అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి గ్రామంలోని వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున నిధులు సమకూరాయని సర్పంచ్ మునగపాటి నవీన్ తెలిపారు. వచ్చిన ప్రతి రూపాయిని పారదర్శకంగా కార్యక్రమానికి వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ధార్మిక మహోత్సవంలో గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జోరల రమేష్, శివగంగ దేవాలయ చైర్మన్ అల్లే కుమార్, మాజీ ఎంపీటీసీ సుదర్శన్ యాదవ్, మాజీ సర్పంచ్ కూన యాదయ్య, స్వర్ణగంటి ఆనందం, కాకి ఈశ్వర్, శివమూర్తి, పోతర్ల అంబయ్య యాదవ్, నిమ్మగూడెం సుధీర్ గౌడ్, వీరిబాబు, పరమేష్, శ్రీశైలం, గోవర్ధన్ రెడ్డి, గుర్రం యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 17 Aug 2026 | 04:41 PM IST
Tags: