హైదరాబాద్: తెలంగాణలోని ఇంజినీరింగ్ నిరుద్యోగ అభ్యర్థుల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీయవద్దని, నవంబర్ 6వ తేదీన నిర్వహించ తలపెట్టిన టీజీపీఎస్సీ ఏఈఈ (TGPSC AEE) పరీక్షను వెంటనే వాయిదా వేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డికి సుదీర్ఘ బహిరంగ లేఖ రాశారు.

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని SSC JE మరియు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని టీజీపీఎస్సీ ఏఈఈ పరీక్షలు ఒకే రోజు (నవంబర్ 6న) ఉండటంతో వేలాది మంది తెలంగాణ ఇంజినీరింగ్ విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో SSC JE పరీక్ష రాసే అభ్యర్థులు.. అదే రోజున వెంటనే తెలంగాణకు తిరిగివచ్చి ఏఈఈ పరీక్ష రాయడం ఏవిధంగా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. ఏళ్ల తరబడి కష్టపడి సిద్ధమైన నిరుద్యోగ యువత, రెండు కీలకమైన పోటీ పరీక్షల్లో ఒకదానిని బలవంతంగా వదులుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పరీక్షల తేదీలను పునఃపరిశీలించి అభ్యర్థులకు న్యాయం చేయాలని స్వయంగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అక్టోబర్ 14వ తేదీనే టీజీపీఎస్సీకి లేఖ రాసిన విషయాన్ని హరీశ్‌రావు గుర్తుచేశారు. అయినా కమిషన్ దీనిపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఒడిశా, బిహార్ వంటి ఇతర రాష్ట్రాల్లో జాతీయ స్థాయి పరీక్షల దృష్ట్యా స్థానిక పరీక్షల తేదీలను మార్చినప్పుడు, తెలంగాణలో ఎందుకు మార్చలేరని నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అనవసర భేషజాలకు పోకుండా తక్షణమే జోక్యం చేసుకుని నవంబర్ 6న జరగనున్న ఏఈఈ (సివిల్) పరీక్షను వాయిదా వేసి, అభ్యర్థులు రెండు పరీక్షలూ రాసే అవకాశం కల్పించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి గందరగోళాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 24 Oct 2026 | 05:18 PM IST
Tags: