కరీంనగర్: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో బ్రిడ్జి నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడంలో కాలయాపన చేయడం సరికాదని, వెంటనే శంకుస్థాపన పూర్తి చేసి పనులు ప్రారంభించాలని సీపీఐ నాయకులు తీవ్రస్థాయిలో డిమాండ్ చేశారు. ఈ మేరకు గన్నేరువరం మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి చొక్కాల శ్రీశైలం మాట్లాడుతూ.. గన్నేరువరం నుంచి ఎలగందల్ వరకు బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.71 కోట్ల నిధులు మంజూరు చేసిన విషయం అందరికీ తెలిసిందేనని గుర్తుచేశారు. గన్నేరువరం మండల కేంద్రంలోని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద బ్రిడ్జి నిర్మాణం కోసం శిలాఫలకం ఏర్పాటుకు గత కొన్ని నెలల కిందటే స్థలాన్ని సిద్ధం చేసినప్పటికీ, ఇప్పటివరకు శంకుస్థాపన నోచుకోకపోవడంపై అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన రోడ్లు లేక, ప్రయాణ దూరం విపరీతంగా పెరిగిపోవడంతో కరీంనగర్ వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఇకనైనా కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ బండి సంజయ్ కుమార్ మరియు స్థానిక శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ వెంటనే స్పందించి ప్రయాణికుల సౌకర్యం కోసం బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని కోరారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే గన్నేరువరం మండల ప్రజలకు కరీంనగర్ వెళ్లుటకు రవాణా మార్గం ఎంతో సులభతరం అవుతుందని, రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోతాయని స్పష్టం చేశారు. తక్షణమే స్పందించి శంకుస్థాపన తేదీని ప్రకటించని పక్షంలో మండల ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సీపీఐ హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో నాయకులు కాంతాల అంజిరెడ్డి, బోయిని మల్లయ్య, కూన మల్లయ్య, ఎండీ నయీం, అంజయ్యచారి, బొమ్మకంటి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 24 Oct 2026 | 04:58 PM IST
Tags: