గన్నేరువరం: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల ప్రజలకు బతుకమ్మ, విజయదశమి పండుగల వేళ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దీర్ఘకాలంగా అరకొరగా పెండింగ్‌లో ఉన్న గుండ్లపల్లి–పొత్తూరు డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. అసంపూర్తిగా నిలిచిపోయిన రహదారి పనులను తిరిగి ప్రాంరంభించి పూర్తి చేసేందుకు ప్రభుత్వం రూ.11 కోట్లు మంజూరు చేయగా, దసరా పండుగ తర్వాత వెంటనే పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టర్ సుముఖత వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో బిల్లులు పెండింగ్‌లో పడటంతో కాంట్రాక్టర్ రోడ్డు పనులను అర్ధాంతరంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, గ్రామస్తులు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారి నిర్మాణం పూర్తికాకపోవడంపై పలు రాజకీయ పార్టీలు, యువజన సంఘాలు, అఖిలపక్ష నాయకులు నిరాహార దీక్షలు, నిరసనలు చేపట్టారు. రోజురోజుకూ జటిలంగా మారుతున్న ఈ రహదారి సమస్యను మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఇటీవల శాసనసభ సమావేశాల్లో సమర్థవంతంగా ప్రస్తావించారు. అసెంబ్లీ వేదికగా ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా నిధులు మంజూరు చేయాలని పట్టుబట్టారు.
ఎమ్మెల్యే విజ్ఞప్తికి తక్షణమే స్పందించిన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సప్లిమెంటరీ నోట్ విడుదల చేసి రూ.11 కోట్ల నిధుల మంజూరుకు మార్గం సుగమం చేశారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం, దసరా తర్వాత పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టర్ ముందుకు రావడంతో గుండ్లపల్లి–పొత్తూరు డబుల్ రోడ్డు నిర్మాణంపై ప్రజల్లో ఆశలు చిగురించాయి. ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీలో పోరాడి నిధులు సాధించిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు గన్నేరువరం మండల ప్రజలు, నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.


