బిజినెస్ డెస్క్: దేశంలో త్వరలో ఇంధన ధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. రాబోయే నవంబర్ నెలలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే అవకాశముందని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ ముఖ్య ఆర్థికవేత్త అలెగ్జాండ్రా హర్మన్ ప్రసాద్ విశ్లేషించారు. వచ్చే ఏడాది దేశంలో ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ప్రభుత్వాలు నవంబర్‌లోనే ధరల పెంపునకు మొగ్గుచూపే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గతేడాది మే నెలలో ప్రకటించిన ఇంధన ధరల పెంపులో సగం వరకు ఈసారి పెరుగుదల ఉండవచ్చని పలువురు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర యుద్ధ పరిస్థితుల కారణంగా కేంద్ర ప్రభుత్వం గతంలో ఇంధన ధరలను సవరించిన విషయం విదితమే.
ఈ ఇంధన ధరల పెంపు ప్రభావం ద్రవ్యోల్బణంపై తీవ్రంగా పడనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 6.2 శాతానికి, 2027 మొదటి మూడు నెలల్లో ఏకంగా 6.5 శాతానికి చేరే అవకాశం ఉందని వివరిస్తున్నారు. తద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్దేశించుకున్న 2 నుంచి 6 శాతం ద్రవ్యోల్బణ లక్ష్య పరిమితిని ఇది మించిపోతుందని అంచనా వేస్తున్నారు.
కాగా, అక్టోబర్ ప్రారంభంలో జరిగిన ద్రవ్య విధాన సమీక్షా సమావేశంలో అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి ద్రవ్యోల్బణం 6 శాతంగా ఉంటుందని, జనవరి-మార్చిలో ఇది 5.7 శాతానికి తగ్గుతుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. మార్చి నాటికి ఆర్థిక సంవత్సరం ముగిసేపాటికి ద్రవ్యోల్బణం 5.2 శాతానికి చేరుకుంటుందని పేర్కొంది. అయితే, రాబోయే కాలంలో అంతర్జాతీయ పరిణామాల కారణంగా ధరల ఒత్తిడి మరింత పెరుగుతుందని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ స్పష్టం చేస్తూ, మార్చి నాటికి ద్రవ్యోల్బణం 5.4 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేస్తోంది.


