హైదరాబాద్: వైద్యం పేరుతో అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యులపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నగరంలో ఇప్పటివరకూ 12 మంది నకిలీ వైద్యులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. కనీస వైద్య పరిజ్ఞానం, సరైన విద్యార్హతలు లేకుండానే డాక్టర్లుగా చలామణి అవుతూ రోగులకు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, బీపీ, డయాబెటిస్ మందులను విచక్షణారహితంగా ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇష్టారీతిన ఇంజెక్షన్లు, సెలైన్లు ఎక్కించడం ద్వారా రోగుల ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెడుతున్నారని పేర్కొన్నారు. సరైన వైద్యం అందకపోతే ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.
నకిలీ వైద్యుల బారిన పడకుండా ప్రజలు అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు. క్లినిక్ లేదా ఆసుపత్రి రిసెప్షన్ వద్ద డీఎంహెచ్‌వో (DMHO) జారీ చేసిన అధికారిక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉందో లేదో పరిశీలించాలని కోరారు. వైద్యుల బోర్డుపై వారి పేరు, విద్యార్హతలతో పాటు టీఎస్‌ఎంసీ (TSMC) రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. వైద్యుడి అర్హతలపై ఏమాత్రం అనుమానం ఉన్నా onlinetsmc.in వెబ్‌సైట్‌లోని 'డాక్టర్ సెర్చ్' ద్వారా వివరాలు చెక్ చేసుకోవాలని సూచించారు. టీఎస్‌ఎంసీ రికార్డుల్లో వివరాలు కనిపించకపోతే ఆ వైద్యుడి అర్హతను అనుమానించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చికిత్సపై సందేహం ఉంటే అర్హత కలిగిన మరో వైద్యుడి వద్ద సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలని, నకిలీ వైద్యుల సమాచారం ఏమైనా తెలిస్తే వెంటనే డయల్ 112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సీపీ కోరారు. నకిలీ వైద్యులపై నిఘా, కఠిన చర్యలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.


