ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో చేపట్టిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. ఇందులో భాగంగా రూ.37.50 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ స్థలంలోయూనిట్లను కలియతిరుగుతూ ఇప్పటివరకు పూర్తయిన పనులు, ప్రస్తుతం జరుగుతున్న పురోగతిని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రి భవనంలో ఏర్పాటు చేయనున్న ఇన్‌పేషెంట్ (IP), ఔట్‌పేషెంట్ (OP), ఐసీయూ (ICU), ఎమర్జెన్సీ వార్డులు, రోగులు మరియు సహాయకుల కోసం వెయిటింగ్ హాల్స్, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పన తీరును పరిశీలించి అధికారులతో చర్చించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి విభాగాన్ని అత్యంత సౌకర్యవంతంగా, ప్లానింగ్ ప్రకారమే తీర్చిదిద్దాలని సూచించారు.
నిర్ధారిత గడువు ప్రకారం వచ్చే డిసెంబర్ నాటికి ఆసుపత్రి నిర్మాణ పనులన్నింటినీ పూర్తిస్థాయిలో ముగించి అందుబాటులోకి తేవాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యతా ప్రమాణాలు తగ్గరాదని, నాణ్యత విషయంలో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల ఇంజనీరింగ్ అధికారులు, వైద్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


