కొప్పునూరు: గ్రామంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గర్భిణులు, బాలింతలు మరియు గ్రామీణ మహిళలకు తల్లిపాల విశిష్టతపై మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కొప్పునూరు గ్రామ సర్పంచ్ వడ్డేమాన్ బిచ్చన్న ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు, తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తూ తగిన సూచనలు, జాగ్రత్తలను అధికారులు తెలియజేశారు. తల్లిపాలు బిడ్డకు ప్రకృతి ప్రసాదించిన తొలి వరమని, జీవితంలో తొలి ఆరు నెలల పాటు తల్లిపాలే బిడ్డకు సంపూర్ణ ఆహారంగా పనిచేస్తాయని తెలిపారు. తల్లిపాలు పట్టడం ద్వారా బిడ్డకు బలమైన రోగనిరోధక శక్తి లభించడమే కాకుండా, ఆరోగ్యకరమైన ఎదుగుదలకు బలమైన పునాది పడుతుందని స్పష్టం చేశారు.
తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డ మెదడు ఎదుగుదలకు తోడ్పడటంతో పాటు తల్లి, బిడ్డల మధ్య ఆత్మీయ అనుబంధం మరింత బలపడుతుందని సమావేశంలో వివరించారు. పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు ప్రారంభించాలని, తొలి ఆరు నెలలు నీరు కూడా ఇవ్వకుండా కేవలం తల్లిపాలే పట్టాలని సూచించారు. ఆరు నెలల తర్వాత అనుబంధ ఆహారంతో పాటు కనీసం రెండు సంవత్సరాల వరకు తల్లిపాలను కొనసాగించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పునాది వేయవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, స్థానిక మహిళలు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


