రంగారెడ్డి: తెలంగాణలో అన్ని వయస్సుల ప్రజలకు వంద శాతం ఫిజికల్ లిటరసీ అందించడమే యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (YIPESU) ముఖ్య లక్ష్యమని ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. కిషోర్ గోపీనాథన్ తెలిపారు. జిల్లా స్థాయిలో ఫిజికల్ లిటరసీ కార్యక్రమం అమలుపై యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో, ఇంటర్నేషనల్ ఫిజికల్ లిటరసీ అసోసియేషన్ సహకారంతో శనివారం రాష్ట్ర స్థాయి వర్చువల్ ఓరియంటేషన్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ డా. కిరణ్మయి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వీసీ డా. కిషోర్ గోపీనాథన్ మాట్లాడుతూ ఫిజికల్ లిటరసీ అనేది కేవలం యువత క్రీడల్లో పాల్గొనేందుకు మాత్రమే పరిమితం కాలేదని, చిన్నారులు, యువత, వృద్ధులు సహా అందరూ శారీరక చైతన్యాన్ని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకునేలా చేయడమే యూనివర్సిటీ ధ్యేయమని స్పష్టం చేశారు. ఆధునిక క్రీడలతో పాటు గ్రామస్థాయిలో సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించి ప్రజల్లో శారీరక చైతన్యాన్ని పెంపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు ఇంటర్నేషనల్ ఫిజికల్ లిటరసీ అసోసియేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో జిల్లా యువజన మరియు క్రీడల అధికారులు సమన్వయంతో కార్యక్రమాలను అమలు చేయాలని, జిల్లా స్థాయి కోఆర్డినేటర్లు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.
ఇంటర్నేషనల్ ఫిజికల్ లిటరసీ అసోసియేషన్ గవర్నెన్స్ అండ్ హెచ్‌ఆర్ ప్రతినిధి అమిత్ మాలిక్ మాట్లాడుతూ ఇప్పటివరకు 50 దేశాలు ఫిజికల్ లిటరసీని స్వీకరించాయని తెలిపారు. శరీరం, మనస్సు, హృదయం సమన్వయంతో కూడినదే ఫిజికల్ లిటరసీ అని, అన్ని వయస్సుల వారు ప్రతిరోజూ చురుకుగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇది అవసరమైన జీవన విధానమని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్. స్వర్ణలత, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రామారావు, చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ జి. శాంతి శ్రీ తదితరులు పాల్గొన్నారు.


