ఫిల్మ్ డెస్క్: కేజీఎఫ్, కాంతార వంటి చిత్రాలతో కన్నడ చిత్రసీమ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ నమ్మకంతోనే యశ్ కేజీఎఫ్ తర్వాత ద్విపాత్రాభినయం చేస్తూ, నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన చిత్రం టాక్సిక్. కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె నారాయణ భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను తెరకెక్కించగా, మలయాళీ నటి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు.
కథా నేపథ్యం
ఇదొక పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ స్టోరీ. 1947లో దేశానికి స్వతంత్రం వచ్చినా గోవా మాత్రం పోర్చుగీసు వాళ్ళ చేతుల్లోనే ఉండిపోతుంది. ఆ సమయంలో మాదక ద్రవ్యాలు, అక్రమ ఆయుధాల వ్యాపారంలో ఆధిపత్యం కోసం జరిగే పోరాటమే ఈ కథ. తన అక్క గంగ (నయనతార)తో కలిసి ఈ నేర సామ్రాజ్యంలోకి అడుగుపెడతాడు రాయ (యశ్). అక్క కోరిక మేరకు అప్పటికే ఆ రంగంలో ఉన్న సాల్వడోర్ (డారెల్ డిసెల్వా)కు అండగా ఉండే రాయను, సాల్వడోర్ తన కూతురు రెబెకా (తారా సుతారియా)తో వివాహం జరిపిస్తాడు. అయితే గోవాకు వచ్చిన రాయల్ సర్కస్ అందాల సుందరి నదియా (కియారా అద్వానీ)తో రాయ శారీరక బంధాన్ని పెంచుకుంటాడు. నదియా ప్రవేశంతో వీరిమధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు వచ్చాయి? తమ్ముడిని అండర్ వరల్డ్ కింగ్‌ను చేయాలనుకున్న గంగ కోరిక తీరిందా? వారికి పుట్టిన బిడ్డ టిక్కెట్ (యశ్)తో ఎలాంటి చిక్కులు ఎదురయ్యాయి అనేదే మిగతా కథ.
విశ్లేషణ
గోవా నేపథ్యంలో డ్రగ్స్, క్యాసినో కల్చర్, అక్రమ ఆయుధాల దందాను హైలైట్ చేస్తూ దర్శకురాలు ఈ చిత్రాన్ని నడిపించారు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ తుపాకీ తూటాలు, గ్రెనేట్ ప్రేలుళ్ళతో రక్తపాతం కనిపిస్తుంది. అక్క-తమ్ముడు, తండ్రి-కూతురు అనుబంధాలు, వివాహేతర సంబంధం వంటి బలమైన భావోద్వేగాలను హత్తుకునేలా మలచడంలో దర్శకురాలు పూర్తిగా విఫలమయ్యారు. కథనం ఒకేచోట తిరగడంతో కొద్దిసేపటికే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. విజువల్స్ కలర్‌ఫుల్‌గా ఉన్నప్పటికీ, ఎమోషన్స్ పండకపోవడంతో సినిమా ప్రేక్షకులకు తీవ్ర నిరాశను మిగుల్చుతుంది. రవి బస్రూర్ నేపథ్య సంగీతం, రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ సినిమా మూడ్‌ను ఎలివేట్ చేసేలా ఉన్నాయి. నటీనటుల విషయానికి వస్తే యశ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేయగా, నయనతార, కియారా అద్వానీ తమ పరిధి మేరకు బాగా నటించారు. మిగతా పాత్రలు అంతగా ప్రభావం చూపలేకపోయాయి.
మొత్తంగా చెప్పాలంటే, భారీ అంచనాలతో వచ్చిన టాక్సిక్ చిత్రం ప్రేక్షకులను అలరించడంలో తడబడిందని చెప్పవచ్చు.


