ఫిల్మ్ డెస్క్: మా సినిమా చూసిన ప్రేక్షకులను డిసప్పాయింట్ చేస్తే.. నేను అమీర్ పేట్ సెంటర్‌లో నిలబడి గుండు గీయించుకుంటా అని హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ఎవరిని నిరాశపరచదని ఆమె తన సినిమాపై పూర్తి ధీమా వ్యక్తం చేశారు.

శివకుమార్‌ కాసారం, శ్వేతా లక్ష్మణ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సహ’. ‘లైఫ్‌ ఆఫ్‌ సంజు’ (SAHAA – Life of Sanju) అనేది ఈ చిత్రానికి క్యాప్షన్. దర్శకుడు నిశాంత్‌ దోటి ఈ చిత్రాన్ని చక్కటి లవ్ అండ్ ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కించారు. సెప్టెంబర్‌ 4న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ గురువారం హైదరాబాద్‌లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో నటీనటులతో పాటు ప్రముఖ నిర్మాత బన్నివాసు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో, హీరోయిన్లు సినిమా విజయంపై అపారమైన నమ్మకం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తమ సినిమాపై ధీమాను తెలుపుతూ హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఒకవేళ సినిమా ప్రేక్షకులను డిసప్పాయింట్ చేస్తే తాను అమీర్ పేట్ సెంటర్‌లో గుండు గీయించుకోవడానికి కూడా సిద్ధమని పేర్కొన్నారు. ఇక హీరో శివకుమార్ కాసారం మాట్లాడుతూ.. "ఒక తోపు సినిమాను చూడబోతున్నామని భారీ అంచనాలు పెట్టుకోకండి, ఒకవేళ మీ అంచనాలకు ఒక్క శాతం తక్కువైనా నేరుగా నాకు కాల్ చేసి బూతులు తిట్టండి" అంటూ తన ఫోన్ నెంబర్‌ను ప్రజలకు ఇచ్చారు. సినిమాపై నమ్మకం ఉండటంలో తప్పులేనప్పటికీ, నటీనటులు చేసిన ఈ రకమైన సంచలన ప్రతిజ్ఞలు, వ్యాఖ్యలపై నెటిజన్లు, ప్రేక్షకులు విభిన్నంగా స్పందిస్తున్నారు.

Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 27 Aug 2026 | 05:50 PM IST
Tags: