హైదరాబాద్: తెలంగాణలో ‘సెన్సస్ 2027’ (Census 2027) నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జనగణనకు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను మరోసారి ప్రచురించాలని ఆదేశించింది. ఈ మేరకు రాబోయే ఆగస్టు 29న తెలంగాణ గెజిట్‌లో ఈ నోటిఫికేషన్‌ను అధికారికంగా ప్రచురించనున్నారు. ఈ సెన్సస్ 2027లో భాగంగా దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో ప్రజలకు సంబంధించిన మొత్తం 40 రకాల వివరాలను సేకరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సేకరించే ముఖ్యమైన వివరాలు

  • జనగణనలో భాగంగా ప్రతి వ్యక్తికి సంబంధించిన పేరు, వయస్సు, లింగం, వైవాహిక స్థితి వంటి ప్రాథమిక వివరాలను సేకరించనున్నారు.

  • వీటితో పాటు కులం, మతం, ఎస్సీ, ఎస్టీ తదితర సామాజిక వర్గాలకు సంబంధించిన వివరాలను కూడా నమోదు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

  • ప్రజల విద్యార్హతలు, ఉద్యోగం, వృత్తి తదితర సమగ్ర వివరాలను కూడా ఈ జనగణనలో నమోదు చేసుకోనున్నారు. ఒక వ్యక్తి ఏ రంగంలో పనిచేస్తున్నారు? వారి ప్రధాన వృత్తి ఏమిటి? వంటి అంశాలపై స్పష్టత తీసుకుంటారు.

  • ప్రజల వలసలకు సంబంధించిన సమాచారాన్ని కూడా సెన్సస్ 2027లో ప్రత్యేకంగా నమోదు చేయనున్నారు. వ్యక్తి పుట్టిన ప్రదేశం, ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారు, గతంలో ఎక్కడ నివసించారు అనే పూర్తి వివరాలను సేకరిస్తారు.

  • ఇవే కాకుండా బ్యాంక్‌ ఖాతాలు, మొబైల్‌ నంబర్‌ వంటి వివరాల సేకరణకు కూడా ఇందులో అవకాశం కల్పించారు.

  • అదేవిధంగా ఆధార్‌, ఓటర్‌ ఐడీ, పాస్‌పోర్ట్‌ వంటి కీలక గుర్తింపు పత్రాల వివరాలను కూడా నమోదు చేసే అవకాశం ఉంటుందని గెజిట్‌లో స్పష్టం చేశారు. వ్యక్తికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉందా? లేదా? అనే వివరాలను కూడా తప్పనిసరిగా సేకరించాలని గెజిట్‌లో పొందుపరిచారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 27 Aug 2026 | 06:46 PM IST
Tags: