బిజెపి అధిష్ఠానం పిలుపు మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌లు ఆదివారం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌లతో భేటీ కానున్న నేతలు.. రాష్ట్రంలో చేపట్టనున్న 'లోక్ తంత్ర బచావో - అరాచక్ హటావో' కార్యక్రమం, సంస్థాగత మార్పులు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై చర్చించనున్నారు.
హైదరాబాద్: తెలంగాణలోని భారతీయ జనతా పార్టీ కీలక నేతలకు జాతీయ అధిష్ఠానం నుంచి అత్యవసర పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌లతో కూడిన బృందం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్ళింది.ఈ పర్యటనలో భాగంగా వారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌లతో వేర్వేరుగా కీలక సమావేశాలు నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో రాబోయే రోజుల్లో చేపట్టనున్న 'లోక్ తంత్ర బచావో - అరాచక్ హటావో' కార్యక్రమం రూపకల్పన, పార్టీ సంస్థాగత మార్పులు, తాజా రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఈ భేటీలలో ప్రధానంగా చర్చించనున్నారు. స్థానికంగా గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి, రానున్న ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా జాతీయ నాయకత్వం తెలంగాణ నేతలకు ప్రత్యేక దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో అధికారాన్ని అందుకోవడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.ఇప్పటికే ఉత్తర తెలంగాణలో పటిష్టమైన ప్రజాధారణ కలిగి ఉన్న బీజేపీ, దక్షిణాది, ఇతర ప్రాంతాల్లో కూడా బలాన్ని పుంజుకునేలా ప్లాన్ చేస్తోంది.ఇందులో భాగంగా నవంబర్ నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, డిసెంబర్ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో విస్తృతంగా పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు గట్టి పోటీ ఇస్తూ అధికారం వైపు పయనించేందుకు అధిష్ఠానం తెలంగాణ విభాగంతో కలిసి ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోంది.