సిరిసిల్ల: అపరిష్కృతంగా ఉన్న మున్సిపల్‌ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో విధుల బహిష్కరణతో పాటు సమ్మెకు వెళ్లక తప్పదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ హెచ్చరించారు. గురువారం సిరిసిల్ల మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, కమిషనర్‌ ఖదీర్‌పాషాకు సిరిసిల్ల మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. సిరిసిల్ల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం అనునిత్యం కష్టపడి పనిచేస్తున్న కార్మికుల సమస్యలను మున్సిపల్‌ పాలకవర్గం, అధికారులు పట్టించుకోవడం లేదని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ కార్మికులకు ఇవ్వాల్సిన యూనిఫాం బట్టలు, చెప్పులు, సబ్బులు, గ్లౌజులు తదితర సామగ్రిని వెంటనే అందించాలని డిమాండ్‌ చేశారు. 60 సంవత్సరాలు నిండిన లేదా విధుల్లో ఉండగా మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించకపోవడం వల్ల మున్సిపల్‌లో కార్మికుల సంఖ్య తగ్గి మిగిలిన వారిపై పనిభారం విపరీతంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్‌ పాలకవర్గం ప్రత్యేకంగా కౌన్సిల్‌లో చర్చించి అదనంగా కార్మికులను నియమించాలని కోరారు.

2009 నుంచి 2012 వరకు కార్మికుల పెండింగ్‌ పీఎఫ్‌ (PF) సమస్యను పరిష్కరించి, వారి వ్యక్తిగత ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంకా కొద్దిమంది కార్మికులకు సంబంధించిన పీఎఫ్‌, ఈఎస్‌ఐ (ESI) సమస్యలను కూడా పరిష్కరించడంతో పాటు కార్మికులందరికీ అధికారిక ఐడీ కార్డులు జారీ చేయాలన్నారు. తక్షణమే కౌన్సిల్‌ సమావేశంలో కార్మికుల సమస్యలపై ప్రత్యేక ఎజెండా పెట్టి చర్చించి పరిష్కరించాలని, లేనిపక్షంలో యూనియన్‌ ఆధ్వర్యంలో సమ్మెతో పాటు నిరసన కార్యక్రమాలకు దిగుతామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కాసర్ల శంకర్‌, పట్టణ అధ్యక్షుడు ఏల్పుల బాలయ్యతో పాటు పలువురు నాయకులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 28 Aug 2026 | 12:43 AM IST
Tags: