సిరిసిల్ల, ఆగస్టు 27: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని జిల్లా ఉద్యోగుల జాక్ చైర్మన్ ఎలుసాని ప్రవీణ్‌కుమార్, కన్వీనర్ సయ్యద్ జబీలు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట జిల్లా ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి(జాక్) ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఈ మహాధర్నాలో గెజిటెడ్, నాన్‌గెజిటెడ్, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు నూతన పీఆర్‌సీ, పాతపెన్షన్ పునరుద్ధరణ, బకాయి ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పాటు ఆరోగ్య కార్డులను జారీ చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే సెప్టెంబర్ 10వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించి పోరాటాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. పెండింగ్ బిల్లులు పదివేల కోట్ల వరకు పెరిగిపోయాయని, పదవీవిరమణ పొందిన వారి కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయని తెలిపారు. ఆరు డీఏలు పెండింగ్‌లో ఉండటం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. జూన్ 2నాటికి ఆరోగ్య కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చి నేటికీ నెరవేర్చలేదని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో జాక్ నాయకులు గాజుల సుదర్శన్, బొల్గం సాగర్, మెట్ట శ్రీకాంత్, మహమ్మద్ రియాజ్, జి. శ్రీనివాసరావు, డుమాల రామ్‌నాథ్‌రెడ్డి, మధుసూదన్‌రావు, సదానందం, సుధాకర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, హరికిషన్, నయిమోద్దీన్, లాల శ్రీనివాస్, మోతీలాల్, పురుషోత్తం, బుర్ర కృష్ణప్రసాద్, కొమ్ము రమేష్, సాయి కిరణ్, విశ్వాస్, రామస్వామి, సురేష్, ప్రవీణ్, అనిల్, మహేందర్‌రావు, శ్రీనివాస్, శివసాయి, ఆర్. శేఖర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


