షాద్‌నగర్: స్వేచ్ఛ, సమానత్వం, మానవత్వమే మహమ్మద్ ప్రవక్త చూపించిన నిజమైన మార్గాలని, ఆ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్‌నగర్ పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించిన మిలాద్-ఉన్-నబీ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ మతమైనా మంచితనాన్ని, మానవత్వాన్ని, ఐక్యతనే బోధిస్తుందని, అలాంటి మహోన్నత బోధనలతో సమాజాన్ని శాంతి మార్గం వైపు నడిపించిన వ్యక్తి మహమ్మద్ ప్రవక్త అని కొనియాడారు.

ప్రస్తుత కాలంలో కొందరు స్వార్థపరులు మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి తరుణంలో మహనీయుల బోధనల ద్వారా పరస్పర ప్రేమతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సర్వమత సమానత్వమే నాటి నుంచి నేటి వరకు మన దేశాన్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తోందని తెలిపారు. ఈ పవిత్ర సందర్భం ముస్లిం సోదరులందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షిస్తూ వారికి ప్రత్యేకంగా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని షాద్‌నగర్ పట్టణంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. పవిత్ర ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో పాటు మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 26 Aug 2026 | 05:13 PM IST
Tags: