కడ్తాల్: ఎల్ నినో ప్రభావంతో వాతావరణంలో వస్తున్న మార్పులు, తగ్గుతున్న వర్షపత్యాన్ని దృష్టిలో ఉంచుకుని భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు, రావిచేడ్ సర్పంచ్ బొప్పిడి గోపాల్ సూచించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణ పనులకు ఆయన ప్రత్యేకంగా భూమి పూజ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా బొప్పిడి గోపాల్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును అత్యంత సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. కేవలం గ్రామాలలోనే కాకుండా రైతులు తమ పంట క్షేత్రాలు, బోరు బావుల వద్ద ప్రత్యేకంగా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అదేవిధంగా పొలాల్లో నీటి నిల్వ కుంటలను నిర్మించుకోవడం ద్వారా భూగర్భ జలాలు వృద్ధి చెంది భవిష్యత్తులో సాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు వీలవుతుందని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు రవికుమార్, హనుమంతు నాయక్, అనిల్, స్థానిక నాయకులు పాండు, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


