కోల్‌సిటీ: రామగుండం నియోజకవర్గ పరిధిలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా ప్రభావితం చేసే స్థాయిలో ఓట్లు కోల్పోవడంతో స్థానిక నాయకుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. 2023లో 2,13,000 ఓట్లు ఉండగా, ప్రస్తుతం 1,83,233 ఓట్లు మాత్రమే మిగిలాయి. అంటే వివిధ కారణాలరీత్యా మొత్తం 30,757 ఓట్లను తొలగించారు. ఇందులో చనిపోయిన వారు 4,748 మంది, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు 8,810 మంది, రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లు తేలిన వారు 16,903 మంది మరియు గైర్హాజరు అయిన వారు 296 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

నియోజకవర్గ పరిధిలోని రామగుండం అర్బన్‌, పాలకుర్తి, అంతర్గాం మండలాల్లో ఈ కోత పడింది. ఒక్క రామగుండం అర్బన్‌లోనే ఏకంగా 26,643 ఓట్లు తగ్గిపోగా, పాలకుర్తిలో 2,149, అంతర్గాంలో 1,965 ఓట్ల తగ్గుదల నమోదైంది. ప్రస్తుత డ్రాఫ్ట్ పబ్లికేషన్‌లో కేవలం 1,83,233 ఓట్లు మాత్రమే ఉన్నాయి.

55 వేల మందికి ఎస్‌ఐఆర్‌ నోటీసులు

ప్రత్యేక ఓటరు సవరణ (సర్‌) ప్రక్రియలో భాగంగా రామగుండం నియోజకవర్గంలో ఏకంగా 55 వేల మందికి నోటీసులు జారీ చేశారు. పేర్లు, పుట్టిన తేదీలు తప్పుగా ఉండటం, తల్లిదండ్రుల వివరాలు సరిపోలకపోవడం, అనామలైజ్‌ కింద 49,034 మందికి నోటీసులు అందగా, 5,555 మందికి మ్యాపింగ్ కాలేదు. ఒక్క రామగుండం అర్బన్‌లోనే రికార్డు స్థాయిలో 44,086 మందికి నోటీసులు జారీ కావడం గమనార్హం. అంతర్గాంలో 4,476, పాలకుర్తిలో 4,474 మందికి ఈ నోటీసులు ఇచ్చారు. దీనిపై ప్రస్తుతం డివిజన్ స్థాయిలో ప్రత్యేక సభలు నిర్వహిస్తూ హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. ఓట్లు తొలగిపోకుండా అవగాహన కల్పించేందుకు బీఎల్‌వోలను ఇంటింటికీ పంపుతున్నారు.

రాజకీయ వర్గాల్లో కలవరం

ఇప్పటికే 30 వేలకు పైగా ఓట్లు గల్లంతు కావడం, మరో 55 వేల మందికి ఎస్‌ఐఆర్‌ నోటీసులు అందడంతో అధికార పార్టీ అప్రమత్తమైంది. డీసీసీ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్‌ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. బూత్‌ల వారీగా ఓట్లను రక్షించుకోవాలని, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు బీఎల్‌వోలతో సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌తో పాటు ఇతర పార్టీలు మాత్రం సర్‌ ప్రక్రియపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఒకటి రెండు సార్లు సమావేశాలు నిర్వహించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎలాంటి ముందడుగు వేయడం లేదు. మరోవైపు నోటీసులు అందుకున్న వేలాది మందిలో తుది జాబితా నాటికి ఎంతమంది ఓట్లు నిలుపుకుంటారనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 28 Aug 2026 | 02:10 AM IST
Tags: