నల్గొండ: సమిష్టి సహకారంతో నల్గొండ జిల్లాలో వెట్టిచాకిరి వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం వద్ద కార్మిక శాఖ ఆధ్వర్యంలో అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన "స్వేచ్ఛ రథాన్ని" ఆయన జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వెట్టిచాకిరి, బానిసత్వం అనేది అనాదిగా వస్తున్న ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు. దీని నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టిందని, అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రచార రథాల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టిందని వివరించారు. ఈ ప్రచార రథాలు రాబోయే 20 రోజుల పాటు జిల్లాలోని ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, వారపు సంతలు, గ్రామ చావడీలు మరియు జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే ప్రదేశాలలో సంచరిస్తూ వెట్టిచాకిరి, బానిసత్వ నిర్మూలనపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తాయని తెలిపారు. కళాకారులు పాటలు, దృశ్య రూపకాలు, కరపత్రాలు, గోడపత్రికల ద్వారా ప్రజలకు చైతన్యం కలిగిస్తారని పేర్కొన్నారు.
జిల్లాలో వెట్టిచాకిరి అనే మాట వినపడకుండా ప్రతీ ఒక్కరూ చైతన్యవంతంగా ఉండాలని కలెక్టర్ కోరారు. ఎక్కడైనా వెట్టిచాకిరి, బానిసత్వానికి సంబంధించిన సమాచారం తెలిస్తే తక్షణమే టోల్ ఫ్రీ నెంబర్ 08069434343 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. వెట్టిచాకిరి నిర్మూలనకు కార్మిక, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ తదితర శాఖల సమన్వయం ఎంతో కీలకమని, ప్రతీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇంచార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమేష్, కార్మికశాఖ ఉప కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్, సహాయ కమిషనర్లు పి. అరుణ, సయ్యద్ మొయిజుద్దీన్, జిల్లా సంక్షేమ అధికారి లావణ్య, ఏహెచ్టీయూ అంజలి, సిడబ్ల్యుసి చైర్మన్ చింతా కృష్ణ, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి గణేష్, కోఆర్డినేటర్ మహేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.


